Wednesday, June 10, 2009

పల్నాటి వీర చరిత్ర - 4

నాగార్జున కొండకాడికి వచ్చిన మందీ మార్బలం అందరూ అక్కడి మంత్రవాదుల మహిమలు, పులుల భయంకరమైన కధలు బ్రహ్మనాయుఁనికి జనాలు వివరించారు.

చుక్కలగుండం దాఁటి, కళ్ళకుంటదాఁటి పెందోట కి వచ్చారు అంతా. అక్కడి అడవిని దాట్టం ఎట్లా అని అందరు గజగజ వణికుతూ ముందుకి కదిలారు. ఓ పెద్దపులి ఆ గుంపులోకి రానే వచ్చింది. గుంపులో కలకలం మొదలైంది. ఎద్దులు, ఆవులు బెదిరి చెల్లాచెదురైనై. నలగామరాజు సైన్యం వచ్చిందని బ్రహ్మనాయఁడు అనుకున్నాడు. చివరకు పులి అని తెల్సుకున్నాడు. లంకన్న, గండుకన్నమనీడు, పులిమీదఁపడి చంపారు. అలా ప్రయాణం జేసిన జనాలు, చివరకు ఏలేశ్వరం వద్దకు వచ్చారు. ఏలేశ్వరంవద్ద కృష్ణానదిని దాఁటి వలస అడవులకి వెళ్ళాలి. రాణులు, దాసదాసీజనం, పుట్లెక్కి కృష్ణదాఁటారు. సైన్యం దాఁటిది. పశువులు ఈదికుంటూ అద్దరి చేరినై.రాజులెక్కిన పుట్లు బయల్దేఱినై. మొసలి ఒకటి ఎదురొచ్చింది. ఎఱ్ఱటి కళ్ళతో, మొగలిపువ్వంటి ముక్కుచాయ, మిసిమి వాడికోరలు, ఒడ్డురాళ్ల వంటి ఒడలి చిప్పలు, అది ఎంతో భయంకరంగా ఉంది. నాయకురాలి కుట్రతో మంత్రవాదులు చేసిన పంపు అనుకున్నారు జనాలు. వీరులు దాన్ని పొడిచారు. అది నదినంతా అల్లకల్లోలం చేస్తూ మలిదేవరాజు పుట్టి మీదకు పోతున్నది. బ్రహ్మనాయఁడు ఉగ్రుఁడై మొసలికి అడ్డం వెళ్ళాడు; సుడిగుండాలన్నింట్లో దాన్ని తిప్పి ముప్పతిప్పలఁబెట్టాడు. ఇంతలో రాజుల పుట్లు అద్దరి జేరుకున్నై. బ్రహ్మన్న పోరాడుతున్నాఁడు.

మొసలిజవం తగ్గట్లా. బ్రహ్మనాయఁడు నీటిలోమునిఁగాడు. మొసలిదెబ్బకు చచ్చి బ్రహ్మనాయుఁడు నీటమునిఁగెనని రాజులు, దొరలు, వీరులు దుఃఖపడ్డారు. బ్రహ్మనాయుఁడి శరీరాన్ని వెతుక్కుని రమ్మని బెస్తలని పంపించారు. వారు మునిఁగి అంతటా చూసారు, ఎక్కడా బ్రహ్మనాయుఁడి జాడె లేదు. ఆశలు వదులుకుని బయటకి వచ్చారు బెస్తలు. రాజులకి విన్నవించుకున్నారు దొరకలేదని. అందరి దుఃఖం అధికమైంది. ఇంతలో బ్రహ్మనాయుని తల్లి శీలమ్మ, రాజులవద్దకు వచ్చింది.

"మీరు ఎంతమాత్రమూ చింతించొద్దు. చుక్కలు రాలితే, చూర్యుడు పడమటపొడిస్తే, సముద్రం ఇంకితే, బ్రహ్మనాయుఁడు చచ్చెను అనుకోవాలి. బ్రహ్మనాయఁడు మొసలిచేత చచ్చువాఁడు కాఁడు. నాకుమారుని మనుష్యుఁడు చంపలేడు. మృగము చంపలేదు. జాతకం చూసినా బ్రహ్మన్న కు ఇప్పుడు చావులేదు. నాకుమారుఁడు వీరుఁడు మొసలిని చంపునుగానీ, మొసలి నా కుమారుఁదిని చంపలేదు" అని చెప్పింది శీలమ్మ.

ఇంతలో బ్రహ్మనాయఁడు నీటిపైకి వచ్చాడు. మొసలిదవడలను కాలితోతన్నినాఁడు, కాళ్లను నడుమును నరికినాఁడు. నదీ ప్రవాహం మొసలి రక్తంతో ఎఱ్ఱబడింది. మొసలి గిలగిల్లాడి ప్రణాలు విడిచింది. బ్రహ్మనాయఁడు పోయి ఒక గుంటిమీద నిలబడ్డాడు. అప్పటినుండి అది నాయనిగుండు అని ప్రసిద్ధికెక్కింది. రాజులు, దొరలు, జనలు, సైన్యం అందరూ సంతోసించారు. మలిదేవరాజు వెంటనే కొలువుజేసి, బ్రహ్మనాయఁన్ని సభలో గౌరవించాడు. మళ్ళీ జనాలు అంతా బయల్దేరి మండాది అడవులకు జేరి విడిదిజేసారు. మేడలు, ఇళ్ళు, కట్టుకున్నారు. రాజుల కులువుకూటములు తీరి దొరల మొగసాలలు ముగిసినై. గోపురాలు లేచినై. వీధులేర్పడ్డై. అంగళ్ళు వెలిసినై. మండాది ఒక పెద్ద పట్టణం అయ్యింది.

[ఇప్పటికీ పల్నాడులోని కొన్ని ప్రంతాల్లో చిరుతపులు ఉన్నాయి. ఇక రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అనే ప్రాజెక్ట్ టైగర్ నాగార్జున సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకూ వ్యాపించి ఉంది. ఏసియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది అని ఎవరో చెప్పగా విన్నా. ఇప్పటికీ అనగా 1999 వరకూ నాకుతెలిసి, రాత్రిళ్ళు బస్సుల్ని ఆపేసేవారు శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళకుండా. దోర్నాల దగ్గర ఆపేస్తారు అనుకుంటా. నాకో కధ చూఛాయగా గుర్తు. మా చిన్నప్పుడు మానాయన జెప్తుండేవాడు. అప్పట్లో పొందుగల లో మానాయనా వాళ్ళు ఉండేవాల్లట. ఓ రోజు ఓ చిరుతపులి ఒకళ్ళింట్లోకి దూరింది. ఆ సమయానికి ఇంట్లో ఎవుళ్ళూ లేరు. జనం గుమిగూడారు. శతవిధాలా ప్రయత్నించినా అది బయటకి రాలేదు. అప్పుడు ఓ పోలీసు జవాను వచ్చి దాన్ని కాల్చేసాడని మా నాయన ఉవాచ]

[కృష్ణానది మొసళ్ళకి పేరు. అన్నీచోట్ల ఉంటాయని కాదు. శ్రీశైలం దగ్గర్నుండి సాగర్ దాకా, సాగర్ దాటినాక కూడా ఉండేవి. తర్వాత జనావాసాలు ఎక్కువవ్వటంవల్ల కుచించుకుపోయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. పొందుగుల దాటినాక, కృష్ణ మూసీ నది కలిసే చూటు దాటంగనే వచ్చే గుండ్రాళ్ళ కయ్యల్లో ఉండేవని చెప్పుకుంటారు.]

[కృష్ణానది చాలా విచిత్రమైన నది. పోను పోనూ(సముద్రానికి వైపుకి) నది ఫ్లాట్ గా ఉంది (బెజవాడ నుంచి కిందకి) కాని, సాగర్ వద్దనుండీ చూస్తే ఎన్నో మలుపులు. అలానే ఆ నది అడుగు ఎంతలోతు అని చెప్పలేరు. కారణం, శ్రీశైలం దగ్గర్నుండీ రాళ్ళ గుట్టలే ఆ రాళ్ళల్లోంచి ప్రవహిస్తుందీ నది. కాబట్టి ఇక్కడ ఒక అడుగు లోతుంటే అడుగుతీసి అడుగేస్తే అరవై అడుగుల లోతుంటుంది. అందుకే సుడిగుండాలు చాలా ఎక్కువ. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఇసుక మేట. అన్నీ చోట్ల ఉండదు. అచ్చంపేట నుండి ఇక కిందకి చేరుకునేసరికి ఇసుక మేట అధికమౌతుంది.]

Wednesday, June 3, 2009

పల్నాటి వీర చరిత్ర - 3

నాయకురాలు బ్రహ్మనాయుఁణ్ణి రెచ్చగొట్టి కోడిపందేలకు తెరతీస్తుంది. ఓడిపోయినోళ్ళు ఏడు సమచ్చరలు రాజ్యంఇడిచిబెట్టి ఇతరప్రాంతాలకు ఎళ్ళాలి అనేది పందెం. పందెంలో బ్రహ్మనాయుఁడు ఓడిపొయ్యి, మాచర్లని ఇడిసిపెట్టి, ఏడేళ్ళు మండాది అడవులకు ఎళ్ళాలని నిర్ణయించాడు. బ్రహ్మనాయుఁడు ఈ విషయాన్ని మలిదేవరాజుకు, మాచర్ల కాపులకు, కరణాలకు చెప్పాడు. కాపులు మలిదేవరాజు పాలనకింద అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నాం, నలగామరాజు మంత్రిణి నాయకురాలికి, మమ్మల్ని ఒప్పగించి పోవాలనుకుంటున్నారు, పంపకాల్లో, పంటల్లో, పన్నుల్లో, కొలతూముల్లో ఆమె మమ్మల్ని వేధిస్తుంది, మేమిక్కడ ఉండలేము. మీవెంట మేమూ అడవులకి వస్తాం, అడవుల్నైనా దున్నుఁతాం కానీ, నాయకురాలికింద బతకలేము అనిచెప్తారు.
మాటతప్పి బ్రహ్మనాయుఁడు కాపులను ఎంటదీస్కెళ్ళాడు, ఊళ్ళన్నీపాడుబెట్టాడు అని శత్రువులు అనుకుంటారు, మాటొచ్చుద్ది. మీరు ఈణ్ణే ఉండండీ అంటాడు బ్రహ్మనాయుడు. కానీ ప్రజలు ఇనలేదు. సరే కానిమ్మని ఒప్పుకున్నాడు బ్రహ్మనాయుడు. అందరూ బయల్దేరండి అని ఊళ్ళో చాటింపేసారు.
వీరులని ఎంటబెట్టుకుని బ్రహ్మనాయుఁడు చెన్నకేశవుని గుడికెళ్తాడు. చెన్నుడి ఆభరణాలన్నీ ఓ పెట్టెలో పెట్టారు. ఆయన్ని కొల్చుకున్నారు. చివరిమొక్కు మొక్కారు. తక్కిన దేవతలకీ మొక్కారు. భైరవునికి భుక్తిపెట్టారు. తిరిగి ఇళ్ళకి వచ్చారు. సరుకులు బండ్లకెత్తుకున్నారు. అందలాలు, గుడారాలు, పల్లకీలు, సిద్ధం చేస్కున్నారు. మాచర్లనుండి బయల్దేరాల్సిన ఆదివారం వచ్చింది. వీరమాతలు, వీరపత్నులు, రాణులు, అందలాల్లో ఎక్కారు. వీరులు, రాజులు గుఱ్ఱాలెక్కారు. సైన్యం కదిలింది. పశువులు కదిలినై. గండికోఁట దాటారు. నాగార్జునకొండ దగ్గరకి వచ్చారు.